Tuesday, 6 December 2016

జయలలిత గురించి ఫేస్‌బుక్‌లో ఓ షేర్..

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను జయ చదువుకున్న చర్చ్ పార్క్ అలుమినీ గ్రూప్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దానిప్రకారం. జయలలిత 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఎంజీ రామచంద్రన్‌ను ధిక్కరించారు. ఎంజీఆర్ ముందు అందరూ చేతులు కట్టుకుని నిల్చుంటే జయ మాత్రం కాలుమీద కాలు వేసుకుని కూర్చునేవారు. పుస్తకాలు చదవడంలో మునిగిపోయేవారు. అదే ధైర్యాన్ని ఆమె రాజకీయాల్లోనూ కొనసాగించారు. ఇంగ్లిష్, హిందీలలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగల నేర్పు ఆమె సొంతం. ఆమె తెలివైనదన్న విషయం ఆమెకు కూడా తెలుసు.
 
ఎంజీఆర్ మృతి తర్వాత రెండు రోజుల పాటు ఆయన మృతదేహం వద్ద అలాగే కూర్చుండిపోయారు. ఆ సమయంలో జయ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను అక్కడి నుంచి ఈడ్చి వేసినంత పనిచేశారు. బయటకు తోసేశారు. జయను గిల్లారు, గిచ్చారు. కాళ్లను తొక్కారు. అయినా ఆమె ఓపికతో ఆ అవమానాన్ని భరించారు. మీడియా కెమెరాలు చూస్తుండగానే ఎంజీఆర్ అంతిమ వాహనం నుంచి ఆమెను తోసేశారు. ఈ అవమానాలన్నీ రాజకీయాల్లో ఆమె మరింత బలం పుంజుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అసెంబ్లీలోనూ అవమానం ఎదుర్కొన్నారు. ఆమెపై దుశ్శాసన పర్వమే నడిచింది. దీంతో డీఎంకేను గద్దె దింపేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని శపథం చేశారు. అనుకున్నట్టుగానే డీఎంకేను గద్దెదింపాకే తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
 
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయలలిత అవివాహితగా ఉంటూనే తమిళ ప్రజలకు ‘అమ్మ’ అయ్యారు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను కోలుకోని దెబ్బ కొట్టడంలో జయ ఎప్పుడూ పైన ఉండేవారు. గతంలో ఓసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటిస్తే జయ నిత్యావసరాలైన టేబుల్ ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు అందజేసి ప్రత్యర్థి పార్టీని చిత్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె విలక్షణతలు ఎన్నో.

No comments:

Post a Comment