‘‘ఖాతాదారుల బలహీనతే సైబర్ చీటర్లకు బలం. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సైబర్ ఛీటర్ల బోనులో చిక్కుకోవాల్సిందే.’’ అని అంటున్నారు సైబర్ నిపుణులు. కొన్ని చిట్కాలు పాటిస్తే సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. ‘‘వ్యక్తి గత వివరాలను, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో భద్రపరచొద్దు. కుటుంబ సభ్యుల పేరుతో పాస్‌వర్డ్ పెట్టుకోవద్దు. ఇతరులతో పంచుకోవద్దు. నెలకోసారి మార్చుకోవాలి.’’ అని సూచిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలకో ఈ-మెయిల్.. వ్యక్తిగతంగా మరొక ఈ-మెయిల్ వినియోగించడం వల్ల సైబర్ నేరగాళ్ల ఆటలకు ఆడ్డుకట్టవేయొచ్చని స్పష్టం చేస్తున్నారు.
పెద్ద నోట్లు రద్దయ్యాయి. డబ్బుతో బ్యాంక్ ఖాతాలు నిండిపోయాయి. ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీల గురించి ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు.. సైబర్ చీటర్ల ఎత్తులకు చిత్తవుతున్నారు. మోదీ నిర్ణయంతో దేశమంతా క్యాష్ లెస్ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు. సైబర్ నేరాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. దీంతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్డు మోసాలు, ఆన్‌లైన్ లావాదేవీలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఘట్‌కేశర్‌లోని ఇన్పోసిస్ క్యాంప్‌సలో డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, డీఐ, ఎస్సైలకు ‘‘క్యాష్‌లెస్ విధానం-సైబర్ సెక్యూరిటీ’’పై సోమవారం అవగాహన కల్పించారు.ఒకే బ్రాంచిలో రెండు ఖాతాలు తీసుకోండి - మహేశ్ భగవత, పోలీస్ కమిషనర్ రాచకొండ.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఒకే బ్రాంచిలో రెండు ఖాతాలు తీసుకోవాలి. ఒకటి ఆఫ్‌లైన్, మరొకటి ఆన్‌లైన్ పద్ధతిలో వినియోగించుకోవాలి. కార్డు లావాదేవీలు ఒక ఖాతా నుంచి మాత్రమే చేయాలి. మరొక ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు భద్రపరుచుకోవాలి. ముఖ్యంగా నకిలీ వెబ్‌సైట్లు, కార్డుల క్లోనింగ్ గురించి ప్రజలకు అవగాహన అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డునెంబర్, ఎక్స్‌ఫైరీ, సీవీవీ, పిన్ నెంబర్లను ఎవరితో పంచుకోవద్దు. డెబిట్ కార్డు కంటే.. క్రెడిట్ కార్డు వినియోగం ఎంతో సేఫ్. ఎందుకంటే క్రెడిట్ కార్డుకు నగుదు లిమిట్ ఉంటుంది. డెబిట్ కార్డుకు ఆ సదుపాయం లేదు. ఖాతాలో ఎంతుంటే అంతా గుల్ల కావాల్సిందే. 2016లో 3 బిలియన్ల సైబర్ దాడులు జరిగితే.. 2023లో 153 బిలియన్లకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ నేరాల్లో కేవలం 10 శాతమే ఫిర్యాదులు అందుతున్నాయి. సైబర్ క్రైంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. తెలంగాణలో కేవలం మూడు పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి.. ఎల్‌బీనగర్, మల్కాజిగి, యాదాద్రి-భువనగిరిలో కూడా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. సైబర్ బాధితులకు పోలీసులే భరోసా కల్పించాలి. కేటుగాళ్లు రెండు సార్లు సైబర్ నేరాలకు పాల్పడితే ప్రతి వారం పోలీస్ స్టేషన్ రావాల్సిందే. అవినీతిని రూపుమాపడానికి ప్రధాని తీసుకున్న నిర్ణయం హర్షించదగింది..
స్మార్ట్‌ఫోన్‌తో జర జాగ్రత్త
- నర్సింగరావు, రీజినల్ మేనేజర్, సీడాక్.
ప్రస్తుతం అందరికీ స్మార్ట్‌ఫోనే లోకమైంది. కనీసం సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకోకుండా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం సేఫ్ కాదు. మనకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ అవుతాయి. వాటి ద్వారా వివరాలన్నీ తస్కరించబడుతాయి. ప్రపంచంలో ఒక ఆసియా ఖండంలోనే 49 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాల్లో ఇండియా 11వ స్థానంలో ఉంది. అందులో మహరాష్ట్ర మొదటి స్థానం ఆక్రమించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నేరాలు పెరిగే అవకాశాలున్నాయి. లోయర్ కేస్, అప్పర్ కేస్, సింబల్, నెంబర్లతో పాస్‌వర్డ్‌లో ఉండాలని అందరికీ తెలిసినా.. ఎవరూ పాటించడం లేదు. పాస్‌వర్డ్ గుర్తుంచుకోవడం బద్దకంగా భావిస్తున్నారు. యూఎ్‌సబీ ద్వారా కంప్యూటర్‌లోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది. అన్నీ యూఎ్‌సబీలను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయకూడదు. ఈ-మెయిళ్ల విషయంలో అ జాగ్రత్త తగదు.
పాస్‌వర్డ్ మార్చుకోవడం లేదు - రంగాచారి,
రిస్క్ అండ్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ వింగ్, ఐసీఐసీఐ.
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో నిర్లక్ష్యం తగదు. భారతదేశంలో 80 శాతం ఖాతాదారులు పదేళ్లు దాటిన ఇంత వరకూ పాస్‌వర్డ్ మార్చుకోలేదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగించేటప్పుడు కచ్చితంగా వర్చివల్ కీబోర్డునే ఉపయోగించాలి. మొయిళ్లలో వచ్చే ఫిషింగ్ మెయిళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. విషింగ్, ఫిషింగ్ ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంక్ నుంచి వచ్చే సందేశాల్లో ఎక్కడ కూడా వినియోగదారుడి పేరును పొందుపరచరు. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వినియోగించేటప్పుడు యూఆర్‌ఎల్‌ను సరిచూసుకోవాలి. కచ్చితంగా హెచ్‌టీటీపీఎస్ అడ్రస్ బార్‌లో ఉండాలి. కొంతమంది ఇంటర్‌నెట్ కేఫ్‌లకు వెళ్లి.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఓపెన్ చెయొద్దు. ఈ కేఫ్‌ల నిర్వాహకులు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయరు. దీంతో వ్యక్తిగత సమాచారం హాంఫట్ చేస్తారు సైబర్ ఛీటర్లు. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
No comments:
Post a Comment