తమిళనాడు ముఖ్యమంత్రి, పాత తరం ప్రముఖ నటి జయలలితకు కడప జనాలు నటిగా నీరాజనాలు పలికారు. ముద్దులోలికే మాటలు... మైమరిపించే నృత్యాలతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసేది. ఎన్‌టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబులాంటి పాత తరం మేటి హీరోల సరసన పోటీ పడి నటించి మెప్పించిన మహానటి జయలలిత. ఆమె సినిమాలంటే అప్పట్లో హీరోలతో పాటు సమాన క్రేజ్ ఉండేది. మనసులు-మమతలు సినిమాతో ఆమె తెలుగు సినీ రంగంలో ప్రవేశించిన అనతికాలంలోనే అగ్ర నటిగా పేరు తెచ్చుకున్నారంటే నటన పట్ల ఆమెకున్న అంకితభావం అర్థమవుతుంది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలను కడప జిల్లా ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఎన్.టి.రామారావు సరసన శ్రీకృష్ణసత్యలో సత్యభామగా నటించి సత్యభామ జయలలిత అనే పేరును సంపాదించుకున్నారు. అంటే ఆ పాత్రలో ఆమె ఏ స్థాయిలో లీనమైందో అర్థమవుతుంది.
రాజకీయంగా కాని, సినీపరంగా కాని ఆమెకు కడప జిల్లాతో ప్రత్యక్ష అనుబంధం లేకున్నా ఇక్కడి ప్రేక్షకులు సినిమా ప్రభావంతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్నారు. కథానాయకుడు, దేవుడు చేసిన మనుషులు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, అదృష్టవంతులు, డాక్టర్ బాబు, భార్యాబిడ్డలు, ఆలీబాబా నలభై దొంగలు, శ్రీక్రిష్ణతులాభారం, గోపాలుడు-భూపాలుడు లాంటి సినిమాలలో ఆమె నటన చూసి జిల్లా ప్రేక్షకులు మంత్ర ముగ్ధులైనట్లు ఆ తరం ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. రాజకీయ పరంగా పెద్ద సంబంధాలు లేకపోయినా నటిగా మాత్రం ఆమె కడప ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. జయలలిత మృతితో కడప జిల్లా సినిమా అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
ఆమె నటన పట్ల కొందరి అభిప్రాయం వారి మాటల్లో ఇలా...
వీఎస్ అమీర్‌బాబు, సినిమా థియేటర్ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయలలిత ఆ తరంలో ఇప్పటి ఐశ్వర్యరాయ్‌లా క్రేజ్ గల నటి. ఆమె నటించిన అన్ని సినిమాలు కడప జిల్లాలో దిగ్విజయంగా ప్రదర్శింపబడ్డాయి. మా థియేటర్‌లో (రహమతీయ) ఆమె నటించిన ప్రేమలు-పెళ్ళిల్లు చిత్రం 50 రోజులు పైబడి నడిచింది. ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ లాంటి మహోన్నత నటులతో పోటీ పడి నటించిన మేటి నటి. కళాకారులు ఏదైనా సాధిస్తారని నిరూపించిన ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన జయలలిత కూడా ఒకరు. ఆమె సినిమా రంగంలోనే కాక రాజకీయ రంగంలోను అందవేసిన చేయి. అందం-నటన కలబోసిన మహానటి జయలలిత. నటనకు భాష్యం... రాజకీయ దిట్ట
షేక్‌హుసేన్ (సత్యాగ్ని), మాజీ ఎమ్మెల్సీ జయలలిత నటనకు భాష్యం చెప్పిన మహానటి. ఆమె పాతతరం పెద్ద హీరోలతో నటించి మెప్పించారు. ఆమె నటించిన ప్రతి సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకతను సంతరించుకునేది. ఆమె సినిమాలంటే అప్పట్లోనే మాకు ఎంతో క్రేజ్. కడప జిల్లా ప్రేక్షకులకు సావిత్రి, దేవిక, క్రిష్ణకుమారి తదితర నటులతో పాటు జయలలిత అన్నా వల్లమాలిన అభిమానం. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మరణం తీరని లోటు.
సత్యభామగా ఆమె నటన సూపర్
బాలిశెట్టి సరోజ, ఫిజికల్ డైరెక్టర్ జయలలిత నటించిన అన్ని సినిమాలు హిట్లే. అందులో శ్రీక్రిష్ణ సత్యలో సత్యభామగా ఆమె నటన అమోఘం. ఎన్‌టి రామారావు లాంటి మహానటుడు టైటిల్‌లో తన సరసన ఆమె పాత్రను ఉంచారంటే ఆమె నటన ఏ పాటిదో అర్థమవుతుంది. ఆమె సినిమాలంటే అప్పట్లో ఉర్రూతలూగేవారు. జానపద, సాంఘీక, పౌరాణిక చిత్రాలలో దేనికదే వైవిధ్యం ప్రదర్శిస్తూ నటించే ఆమె అంటే జిల్లా ప్రేక్షకులకు చెప్పలేని అభిమానం. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో ఆమె పోటీ పడి నటించేవారు. రాజకీయాలలో మహిళా లోకానికి పేరు తెచ్చిన మహోన్నతురాలు.
No comments:
Post a Comment