చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్ద తుపాను ప్రభావం భారత్‌లోని ఇంటర్నెట్ సేవలపైనా పడింది. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి దేశంలో అంతర్జాల సేవలు బాగా నెమ్మదించాయి. కొన్ని నెట్‌వర్క్‌లలో ఉన్నట్టుండి ఇంటర్నెట్ వేగం 2జీ కంటే తక్కువకు పడిపోయింది. మరికొన్ని నెట్‌వర్క్‌లలో పూర్తిగా ఆగిపోయిందని వినియోగదారులు చెబుతున్నారు. అలా జరగడానికి ప్రధాన కారణం చెన్నైలో ఉన్న ఇంటర్నెట్ గేట్‌వేలపై తుపాను ప్రభావం పడటమేనట! కొన్ని నెట్‌వర్క్ ప్రొవైడర్ సంస్థలు ఇదే విషయాన్ని తమ వినియోగదారులకు మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నాయి. యూ బ్రాడ్‌బ్యాండ్.. ఎల్‌ఎస్ బ్రాడ్‌బ్యాండ్.. ఎయిర్‌టెల్.. వొడాఫోన్ సంస్థలు వినియోగదారుల ఫోన్లకు అలర్ట్‌లు పంపిస్తున్నాయి.
సోమవారం కురిసిన భారీ వర్షం.. బలమైన గాలుల ధాటికి తమిళనాడులో పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్న వాటిలో దేశానికి ఇంటర్నెట్‌ను అందించే ప్రధాన గేట్‌వేలు ఉన్నాయట. దాంతో సోమవారం మధ్యాహ్నం తుపాను చెన్నైని ముంచెత్తడంతో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు.
భారత్‌ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేయడంలో చెన్నై.. ముంబయి నగరాలు చాలా కీలకమైనవి. దేశానికి అత్యధిక బ్యాండ్‌విడ్త్ అందించే అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్‌వేలు ఈ నగరాల్లోనే ఉన్నాయి. సింగపూర్ నుంచి యూఏఈ వరకు సముద్రగర్భంలో ఏర్పాటు చేసిన ‘బే ఆఫ్ బెంగాల్ గేట్‌వే’ కేబుల్ లైన్ చెన్నై.. ముంబయిలను కలుపుతూ వెళ్తుంది. 1250జీబీ/సెకన్ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియో.. వొడాఫోన్ సంస్థలు ఈ గేట్‌వేనే వినియోగిస్తున్నాయి.
అలాగే భారతీ ఎయిర్‌టెల్, సింగపూర్ టెలీకమ్యూనికేషన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కేబుల్ లైన్ చెన్నై, సింగపూర్‌లను కలుపుతుంది. టాటా సంస్థకూ చెన్నైలో ఇంటర్నెట్ లాండింగ్ స్టేషన్ ఉంది. తమిళనాడులోని టుటికొరిన్, శ్రీలంకలోని కొలంబోల మధ్య బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇలా దేశానికి అత్యధిక ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించే నగరాల్లో ముంబయి మొదటి స్థానంలో ఉంటే, చెన్నైది రెండో స్థానం. అందుకే వర్ద తుపాను ప్రభావం దేశవ్యాప్తంగా అంతర్జాల సేవలపై పడింది. ఈ ప్రభావం ఎన్ని గంటలు, ఎంతకాలం ఉంటుదన్న దానిపై ఇంతవరకూసర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఏం చెప్పలేదు. అయితే నెట్ ప్రతి ఒక్కరి అవసరంగా మారిన నేపథ్యంలో అత్యావశ్యక సేవగా పరిగణించి పరిస్థితిని పూర్వపు స్థితికి తెస్తారనడంలో సందేహం లేదు!
No comments:
Post a Comment