Tuesday, 13 December 2016

వివాహ వేదిక... వసూళ్లకు పాచిక

మోసం చేయాలంటే బుర్రకు పదునుపెట్టాలి. ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.10 లక్షలు, రూ.20 లక్షలు తీసుకొని పరారైతే పోలీసులు పట్టుకుంటారు. అందుకే తక్కువ డబ్బు తీసుకొని ఎక్కువమందిని మోసగిస్తే... పోతే పోయింది అనుకుంటారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేయరు. వందల మందిని మోసం చేయాలంటే ఎలా? అని ఆలోచిస్తే పెళ్లి సంబంధాల పేరుతో సులభంగా బుట్టలో వేసుకోవచ్చని పథకం వేశాం. పత్రికల్లో ప్రకటనలిచ్చాం. రిజిస్ట్రేషన్‌ రుసుం పేరుతో రూ.5 వేల నుంచి రూ.10 వేలు కట్టించుకున్నాం.. డబ్బు జమచేసినవారు ఫోన్‌చేస్తే నేను, మా ఉద్యోగి వధువు తల్లిదండ్రులుగా మాట్లాడేవాళ్లం. వధువును చూసుకునేందుకు రావాలంటూ చెప్పేవాళ్లం. సరిగ్గా ఆరోజు ఫోన్‌చేసి మా అమ్మాయికి సంబంధం కుదిరింది వేరే సంబంధం చూసుకోండి అని చెప్పేవాళ్లం.. ఇలా వందలమంది మోసం చేశాం..’’
- పెళ్లి సంబంధాలు కుదుర్చుతాం అంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు విచారణసందర్భంగా సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పిన అంశాలివి.
సంబంధాల పేరిట నేరగాళ్ల మాయాజాలం 
మెట్రో నగరాల్లో వివాహ వేదికలు, పెళ్లి సంబంధాల పేరుతో కొందరు నేరగాళ్లు చేస్తున్న మాయాజాలమిది. వధూవరులను ఒకటి చేస్తామంటూ రిజిస్ట్రేషన్‌ రుసుం వసూలు చేసుకోవడం, నాలుగైదుసార్లు మాట్లాడడం ఆ తర్వాత సంబంధం కుదరలేదంటూచెప్పి కొన్నినెలలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలకు బలైనవారిలో 99 శాతం మంది ఫిర్యాదు చేయకపోవడంతో చాలామందిని పోలీసులు పట్టుకోవడం లేదు. తమను నమ్మించి మోసం చేశారన్న ఆగ్రహంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండంతోనిందితులు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నారు. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారిని పట్టుకునేందుకు ‘డెకాయ్‌ ఆపరేషన్‌’ నిర్వహిస్తున్నారు. కేవలం రెండువారాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న 15 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.
తక్కువ మొత్తం... రూ.లక్షల్లో జమ: మెట్రో నగరాల్లో పెళ్లి సంబంధాల కోసం తీవ్రంగా శ్రమించాలి. బంధువులు, వంశస్థులైతే సరే.. కొత్త సంబంధాలంటే చాలాసార్లు తిరగాలి. అందుకే 60 శాతం మంది పెళ్లి సంబంధాలు కుదిర్చే వివాహ వేదిక(మ్యారేజ్‌ బ్యూరో)లను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ చెల్లిస్తే వధూవరులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండడంతో వివాహ వేదికలకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మోసం చేసి సంపాదించాలని ప్రయత్నించే నేరగాళ్లు కొత్తగా వివాహ వేదికలను ప్రారంభిస్తున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించిన తర్వాత నాలుగైదు రోజులు వారితో ఫోన్లలోనే మాట్లాడుతున్నారు. తమకు చాలా పనులుంటాయని ఫోన్‌ నంబర్ల ద్వారా మాత్రమే సంప్రదించాలని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం ఖాతాలో పడిన వెంటనే వారం రోజుల వరకూ మాట్లాడి ఆ ఫోన్‌ నంబరు ఆపేస్తున్నారు. కొత్త సిమ్‌లు వేసి కొత్తగా ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్కో ఫోన్‌ నంబరుకు కనీసం 100 మంది నుంచి 200 మందిని లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.5 వేల చొప్పున 100 మంది చెల్లిస్తే రూ.5 లక్షలు, 200 మంది జమచేస్తే రూ.10 లక్షలు నిందితులకు వస్తుంది. ఇందుకోసం వారు ఖర్చుచేసేది రూ.20 వేల లోపే. ఫోన్‌లోనే మాట్లాడడంతో బాధితులు నిందితులను గుర్తించలేని పరిస్థితి ఒకవేళ గుర్తించినా.. ఫోన్లు ఆపేసి ఉండడంతో దర్యాప్తు అక్కడితో ఆగిపోతుంది.అంచెలవారీగా నమ్మించి...
పత్రికల్లో ప్రకటనల ద్వారా రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించినవారిని మోసగాళ్లు అంచెలవారీగా నమ్మిస్తున్నారు. రుసుం వారి ఖాతాలో పడ్డాక ఒకట్రెండు రోజులు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. దీంతో చాలామంది వీరిమాటలను నమ్ముతున్నారు. ్ద ఫలానా ప్రాంతంలో పెళ్లికాని అమ్మాయి ఉంది. వారి ఫోన్‌ నంబరు తీసుకోండి అంటూ ఇస్తున్నారు. ్ద బాధితులు ఫోన్‌ చేయగానే మోసగాడే గొంతుమార్చి వధువు తండ్రిగా పరిచయం చేసుకుని మాట్లాడి.. కట్నం అడిగినంత ఇచ్చుకోలేమని, రెండురోజుల్లో వస్తే మాట్లాడుకుందామని చెబుతున్నారు. ్ద రెండురోజుల తర్వాత మళ్లీ మోసగాడే ఫోన్‌ చేసి తమ బంధువుల అబ్బాయితోనే పెళ్లి కుదిరిందని, ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అంటూ మాయమాటలు చెబుతున్నాడు. ్ద బాధితులు వివాహ వేదిక ఫోన్‌నంబర్‌కు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని వివరించగా... అయ్యో.. ఇలా జరిగిందా? వేరే సంబంధం చూస్తాం అంటూ చెప్పి, మళ్లీ ఇంకో నంబరు ఇస్తున్నారు. ్ద పెళ్లికొడుకు తండ్రి ఆ ఫోన్‌నంబరుకు ఫోన్‌ చేయగానే మోసగాడి భాగస్వామి లేదా అతడి బంధువు(మహిళ) పెళ్లికూతురి తల్లిలా మాట్లాడుతుంది. సంబంధం ఇష్టమేనని తన భర్త వూర్లోలేనందున రెండురోజుల తర్వాత ఫోన్‌ చేయాలని చెబుతుంది. రెండురోజుల తర్వాత పెళ్లికొడుకు తండ్రి ఫోన్‌ చేస్తే... మోసగాడే వధువు తండ్రిగా మాట్లాడి రెండు రోజుల క్రితం పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చానంటూ చెబుతున్నాడు. అనంతరం ఫోన్లు ఆపేస్తున్నారు.

No comments:

Post a Comment