నిద్రలేచాక.. తొలి రెండు గంటలు చాలా కీలకమంటున్నారు పరిశోధకులు! ఆ సమయంలో ఉత్సాహం నింపే పనులు ఏకాగ్రతతో చేయగలిగితే రోజుమొత్తాన్నీ ఏ చికాకులూ లేకుండా ఎదుర్కోవచ్చని అంటున్నారు. మరి అలాంటి వేకువ కోసం ఏం చేయాలి?
వ్యాయామం : గుండె వేగాన్ని పెంచే వ్యాయామం ఏదైనా సరే మన కేవలం గంటలోనే మన శక్తిస్థాయుల్ని పెంచుతుంది. మన రోజు చాలా చురుగ్గా మొదలవుతుంది. నగరజీవులు చెట్లు బారులుతీరిన ఉద్యానవనాల్లో వేగంగా నడవడం.. ప్రతికూల ఆలోచనలు పదేపదే రాకుండా అడ్డుకుంటోందని చెబుతోంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సస్‌కి చెందిన తాజా పరిశోధన!
నవ్వు : ఎదుటివాళ్లని చూసి మనం చిందించే చిరునవ్వు కూడా.. హృద్రోగానికి అడ్డుకట్టవేయగలదని చెబుతోంది అమెరికాలోని ప్రఖ్యాత మాయో క్లినిక్ సంస్థ! కాబట్టి.. ఉదయంవేళ మీకు కనిపించే ప్రతివాళ్లనీ హాయి దరహాసంతో పలకరించమంటోంది. దాంతోపాటూ.. పక్కున నవ్వుతెప్పించే జోక్ చదవడం, వినడం మీ రోజు మొత్తాన్ని ఆనందంగా నింపగలదట.
పండ్లూ, పచ్చికాయగూరలు : ఉదయం వేళ ఇడ్లీ, దోశకే పరిమితం కాకుండా.. ఏదైనా పండ్లూ, కాయగూరలనీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎంతో ఉత్సాహం మన సొంతమవుతుంది. పండ్లలోని గ్లూకోజు మెదడుకి నూతనోత్తేజాన్నిస్తుంది.
స్వచ్ఛతః : ఉదయం లేవగానే ఇల్లు చిమ్ముకోవడం, అంట్లు తోమడం.. పెద్దవాళ్లు ఇలాంటి పనులు పురమాయిస్తే విసుక్కుంటాం మనం. చదువులకోసం ఒంటరిగా ఉంటుంటే.. ఇక చెప్పక్కర్లేదు! పొద్దున్నే ఏదోరకంగా మన పరిసరాల్ని శుభ్రం చేయడం కొత్త హుషారునిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంట్లే తోమాలని కాదు.. మీ చదువుల బల్లని తుడిచినా చాలు!
No comments:
Post a Comment