జయ నెచ్చెలి శశికళ ప్రవేశం జయ జీవితంలో ఎన్నో మార్పులకు కారణమైంది. జయను తన బంధువులే మోసం చేయడంతో ఆమె ఓకానొక దశలో ఎవ్వరిని నమ్మాలో…ఎవ్వరిని నమ్మకూడదో తెలియని స్థితికి వచ్చేసింది. జయ తల్లి సంధ్య చనిపోవడంతో ఆమెను తన అన్నవాళ్లు మోసం చేసి ఆమె వద్ద ఉన్న డబ్బులు అన్ని దోచుకెళ్లిపోయారు. ఇదే విషయాన్ని ఆమె శోభన్‌బాబుతో కూడా పలుసార్లు ప్రస్తావించినట్టు ఆయన రాసిన వ్యాసం ద్వారా తెలిసింది.
ఇదిలా ఉంటే తల్లి మరణం తర్వాత అప్పటివరకూ తాను ఒంటరినేనన్న భావనలో వున్న జయకు.. శశికళ బంధువులు దగ్గరయ్యారు. 1995లో తొలిసారి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహాన్ని చెన్నైలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. ఈ పెళ్లి అప్పట్లో గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. చెన్నైలో 50 ఎకరాల మైదానంలో 1,50,000 మంది అతిథులకు విందు ఏర్పాటుచేయడం ద్వారా అతిపెద్ద వివాహ విందుగా రికార్డులకెక్కింది.
ఈ పెళ్లికి జయ నివాసం ఉండే పోయస్‌గార్డెన్ నుంచి వివాహ వేదికకు మధ్య కొన్ని కి.మీ. దూరానికి రోడ్డుకిరువైపులా గ్రీసు విగ్రహాలు, బంగారపు పూతపూసిన సింహపు బొమ్మలు, దేవతల రూపంలో జయ చిత్రాలు, కొన్ని వందల టన్నుల గులాబీలు ఉంచారు. ఆ మార్గంలో వీధులన్ని అరటి తోటల్లా మారిపోయాయి. ఈ వివాహ ఆహ్వాన పత్రికకు బంగారపు పూత పూయించారు.
వివాహానికి వచ్చిన వారికి వెండి ప్లేటును బహూకరించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ పెళ్లి తరువాతే జయపై అక్రమ ఆస్తుల కేసులు మొదలయ్యాయి. ఐటీ శాఖ అప్పట్లో పెళ్లి ఖర్చులు రూ.10 కోట్లుగా అంచనా వేసింది. ఆ పెళ్లే ఆమెపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడానికి కారణమైనట్టు టాక్ ఉంది.
No comments:
Post a Comment