Tuesday, 6 December 2016

అమ్మకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం అర్దరాత్రి కన్ను మూసిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తి అయ్యాయి. అభిమానులు అశ్రునయనాలతో అమ్మకు వీడ్కోలు పలికారు. మెరీనా బీచ్‌ కి చేరుకున్న జయలలిత అమ్మ పార్ధివ దేహంపై ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్ప గుచ్ఛం ఉంచారు. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ అధికారులు గౌరవ వందనాన్ని సమర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా.. పలువురు నేతలు అమ్మ పార్థివదేహానికి పుష్పాలు ఉంచారు.
అలానే తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ తదితరులు నమస్కరించారు. అనంతరం.. పురోహితులు జయలలిత ప్రియనేస్తం శశికళ, దత్త పుత్రుడు సుధాకరన్ చే అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు. జయలలిత పార్థివ దేహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన గంధపు చెక్క పేటికతో ఖననం చేశారు. ఆ సమయంలో మెరీనా బీచ్ శోక సముద్రంలో మునిగింది. ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ‘అమ్మ’ అంత్యక్రియలకు నాయకులు, ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. అందరూ చివరిసారిగా ‘అమ్మ’కు వీడ్కోలు పలికారు.

No comments:

Post a Comment