వాస్తవానికి ప్రజా జీవితంలో ఉండే నాయకుల జీవితాలు తెరచిన పుస్తకాల వంటివని.. వారి గురించిన ప్రతి చిన్న విషయం ప్రజలకు తెలుస్తుందని వింటూ ఉంటాం. కానీ.. అందుకు విరుద్ధంగా దక్షిణాదిన మహిళా ముఖ్యమంత్రిగా తన సత్తా చాటిన జయలలిత జీవితంలో రహస్యమెంతో? ఆమె అనారోగ్యం పాలై అపోలో ఆసుపత్రిలో చేరడం.. ఆపై 74 రోజుల పాటు జరిగిన హైడ్రామా.. మరణం అంతా రహస్యమే. తమిళ రాజకీయాల్లో రికార్డు సృష్టిస్తూ.. రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చిన కొన్ని నెలలకే ఆమె దూరం కావడంతో ప్రజల్లో విషాదం నెలకొంది.
ప్రజలకు తెలిసినంత వరకూ జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి.. సోమవారం డిసెంబర్ 5న రాత్రి 11:30 గంటల సమయంలో ఆమె మరణించే వరకూ ప్రతి విషయం అత్యంత రహస్యంగానే ఉండిపోయింది. అసలు అమ్మకి ఏమయింది? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం అపోలో యాజమాన్యం, కొద్దిమంది వైద్య నిపుణులు, నెచ్చెలి శశికళకు తప్ప మరెవరికీ తెలియదు. అన్నాడీఎంకే మంత్రులు.. పార్టీ పెద్దలకు కూడా తెలియదు. లేకుంటే.. టీవీల్లో వార్తలు చూసి జయలలిత మరణించిందని ఖరారు చేసుకుని పార్టీ కార్యాలయం ముందు జెండాను దింపేసే నిర్ణయం తీసుకుంటారా? అని అనుమానాలు ఉన్నాయి.
ఒక్క వీళ్ళకే కాదు.. జాతీయ స్థాయి నేతలకూ ఆమె ఆరోగ్యం, పరిస్థితిపై సరైన సమాచారం తెలియదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడైనా.. గవర్నర్ విద్యాసాగర్ రావైనా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయినా.. అపోలో వైద్యుల రహస్యం ముందు ఒకటే. రాహుల్ గాంధీకి కూడా అమ్మను చూపించలేదు. సరైన సమాచారాన్ని ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు.
కేవలం.. కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, స్వయంగా తింటున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని.. ప్రకటనలు చేశారే తప్ప, ఆమె వీడియోను, ఆమె మాటను, కనీసం ఫోటోలను కూడా విడుదల చేయక పోవడం.. చివరికి అంతా బాగుంది.. ఈ రోజో రేపో డిశ్చార్జ్ అని చెబుతూ.. ఒక్కసారిగా గుండె పోటు అని చెప్పారు. ఆ తరువాత అమ్మ చనిపోయిందని బయటికి తీసుకు రావడంతో పలు అనుమానాలకు తావు ఇస్తుంది.
ఇంత రహస్యం ఎందుకు పాటించారన్న ప్రశ్నకు ఇక సమాధానం కూడా దొరకదేమో. చివరి దశలో ఆమెకు జరిగిన చికిత్సా వివరాలు సైతం రహస్యంగానే మిగిలిపోవచ్చేమో? ఇక ప్రజలకు అమ్మ ఏమైనా చెప్పాలని అనుకున్నా.. అమ్మ సందేశం కూడా బయటికి రానివ్వలేదని కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. జయలలిత ఆలా చనిపోయిందో లేదో.. ఇలా ఒక గంటలో ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం జరగడం.. ఇవన్నీ మిస్టరీ గానే మిగిలిపోయాయి.
No comments:
Post a Comment