Monday, 19 December 2016

తిరువీధిలో గజరాజు బీభత్సం దాడిచేయడంతో మావటి కాలికి తీవ్రగాయం ఆ తర్వాత యథావిధిగా శ్రీవారి సేవలో పాల్గొన్న అవనిజ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి గజరాజు ఒకటి ఆదివారం మావటిపై దాడి చేసింది. తిరుమలేశుడికి నిత్యం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో వూరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. దేవతామూర్తుల వూరేగింపు సందర్భంగా ముందుభాగంలో రెండు గజరాజులు నడుస్తాయి. 



వూరేగింపులో పాల్గొనడానికి అవనిజ, లక్ష్మి అనే ఏనుగులను శ్రీవారి ఆలయం ఎదుటకు సాయంత్రం మావటిలు తీసుకువస్తున్నారు. ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం శ్రీవరాహస్వామివారి ఆలయం దాటి తూర్పు మాడవీధిలోకి ప్రవేశించే సమయంలో.. ఒక్కసారిగా అవనిజ ఘీంకరిస్తూ పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. మావటి గంగయ్య దాన్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించగా.. ఆగ్రహించిన ఏనుగు తొండంతో కొట్టింది. తిరువీధిలో కిందపడ్డ అతని కుడికాలిపై పాదం మోపింది. దీంతో గంగయ్య కాలు విరిగిపోయింది. అనంతరం అవనిజ పక్కనే ఉన్న ఇనుప కంచెను తొక్కి విరగ్గొట్టింది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న తితిదే సిబ్బంది మావటి గంగయ్యను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఈ ఏనుగు మూడు సార్లు దాడి చేసింది. ఆదివారం సాయంత్రం ఈ అలజడి ముగిసిన తర్వాత అవనిజ యథావిధిగా శ్రీవారి సేవలో పాల్గొంది.

No comments:

Post a Comment