- ప్రతిష్ఠాత్మక టైమ్ పోల్‌లో అగ్రస్థానం
- 18 శాతం ఓట్లు సాధించిన ప్రధాని
- ఒబామా, ట్రంప్, పుతిన్ మోదీ తర్వాతే
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఎంపికయ్యారు. ఈ మేరకు టైం మేగజీన్ నిర్వహించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016 ఆన్‌లైన్ పోల్‌లో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, కాబోయే అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులను వెనక్కి నెట్టారు. టైం మేగజీన్ నిర్వహించిన ఈ పోల్ ఆదివారం రాత్రి ముగిసింది. అప్పటికి 18 శాతం ఓట్లతో మోదీ చాలా ముందున్నారు. మోదీ తర్వాతి స్థానంలో ఒబామా, ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ఉన్నారు. వీరు ఏడు శాతం ఓట్లను సాధించారు. ఇక ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బెర్గ్, ట్రంప్‌పై పోటీ చేసిన హిల్లరీ క్లింటన్‌లు వరుసగా రెండు, నాలుగు శాతం ఓట్లను సాధించారు. టైం ఎడిటర్ల బృందం ఈ వారాంతానికి పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016ను ప్రకటిస్తుంది. ఈ పోల్‌లో మోదీ మొదటి స్థానంలో నిలవడం ఇది రెండోసారి. 2014లోనూ మోదీ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. అప్పట్లో మోదీకి 16 శాతం ఓట్లు.. అంటే 50 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. మోదీ భారత ప్రధాని కాకమునుపు నుంచే నాలుగేళ్లుగా ఈ పోటీలో ఉంటున్నారు. గతేడాది జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల దేశంలో పెద్దనోట్లను రద్దు చేయడంతో మోదీకి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాడి పోల్ మొదలైన తొలి దశలో మోదీ ఏకంగా 21 శాతం ఓట్లను సాధించారు. అసాంజే కూడా ఒక దశలో ట్రంప్‌ను వెనక్కి నెట్టారు. అక్టోబరు 16న మోదీ పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి తల్లిగా అభివర్ణించినపుడు ఆయన గురించి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరిగినట్లు టైం పేర్కొంది.
మోదీ టైం మేగజీన్ ఈ ఏడాది మేటి వ్యక్తిగా ఎంపిక కావడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ విమర్శించింది. అలాటి సర్వేని భారతలో చేస్తే ఆయనకు పాపులారిటీ తగ్గినట్లు వెల్లడవుతుందని పేర్కొంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఉమాభారతి మోదీకి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాజ్‌బబ్బర్, రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతలో పరిస్థితులపై ప్రపంచానికి అవగాహన లేదని.. అందువల్లే విదేశీయులు మోదీకి ఓట్లేశారని తెలిపారు. ఆయన నిర్ణయాలతో భారతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన ప్రపంచానికి గొప్ప వ్యక్తి ఎలా అవుతారని ప్రశ్నించారు.
టైమ్స్ పాఠకుల పోల్‌లో అగ్రస్ధానంలో నిలిచినందుకు ప్రధాన మంత్రి మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment