Tuesday, 6 December 2016

తమిళనాట జయలలిత శకం ముగిసింది. అమ్మా అంటూ ఆరాధించిన అందర్నీ విడిచి ఆమె వెళ్లిపోయారు. ఆమెను కడసారి చూసేందుకు.. చేతులెత్తి మొక్కేందుకు జన వాహిని పోటెత్తింది. ఆ శోకసంద్రానికి.. ఎల్లలెరుగని అభిమానానికి మూగసాక్షిగా నిలిచింది ఆ పురాతన భవనం. అదే రాజాజీ హాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలులోనే ఉంచారు. నగరంలోని మౌంట్ రోడ్డుకు చేరువగా ఉన్న ఆ భవనానికి వచ్చే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఒకప్పడు బాంకెట్ హాలుగా పిలిచిన రాజాజీ హాలుతో జయలలితకు అవినాభావ సంబంధం ఉంది. ఆమె పరాభవానికి గురైనది అక్కడే.. జయజయధ్వానాలు అందుకున్నదీ అక్కడే. అదే ఆమె చివరి మజిలీ కూడా. ఇక్కడ నుంచే ఆమె అంతిమయాత్ర ప్రారంభమై.. సమాధి స్థలి అయిన మెరీనా బీచ్ వరకు సాగింది. జయలలిత రాజకీయ గురువు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పార్థివదేహాన్ని కూడా అప్పట్లో ప్రజల సందర్శనార్థం ఇదే హాలులో ఉంచారు. గంటల తరబడి ఎంజీఆర్ పార్థివదేహం వద్ద ఉన్న ఆమెను అంతిమయాత్రలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. వాహనంలోకి ఎక్కబోతే పక్కకు లాగేశారు. అవమాన భారంతో అక్కడ నుంచి ఆమె వెనుతిరిగారు. తర్వాత రాజకీయాల్లో తన సత్తా నిరూపించుకున్న జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆమె తొలిసారి ప్రమాణ స్వీకారానికి వేదిక ఇదే రాజాజీ హలు. ఆమె పరాభవం జరిగిన నాడు నోరు మెదపని వారంతా ఆ భవనం సాక్షిగా జయజయధ్వానాలు పలికారు. రాజాజీ హాలుకు రెండు శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. 1800-1802 మధ్య కాలంలో నిర్మించిన ఈ భవంతిని ఒకప్పుడు బాంకెట్ హాలుగా పిలిచేవారు. నాలుగో ఆంగ్లో-మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్‌పై విజయానికి చిహ్నంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భవంతిని నిర్మించారు. 1875 తర్వాత నుంచి అనేక మార్పులు చేర్పులు చేశారు. 1857 నుంచి 1879 మధ్య కాలంలో మద్రాసు యూనివర్సటీ స్నాతకోత్సవాలు వేదికగా నిలిచింది. 1938 నుంచి ఏడాది పాటు మద్రాసు ప్రెసిడెన్సీ సమావేశాలు ఇక్కడ జరిగాయి. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశానికి గవర్నర్ జనరల్, స్వాతంత్ర్యం వచ్చాక మద్రాస్ స్టేట్ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్ సి.రాజగోపాలాచారి గౌరవార్థం ఆయన పేరు పెట్టారు.

No comments:

Post a Comment