Tuesday, 6 December 2016

రూ.1.50 కోట్ల జీతంతో ఐఐటీ కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ జాబ్‌..!

నిజంగా… తెలివి ఎవ‌డ‌బ్బ సొత్తు కాదు. అది ఎవ‌రిది వారికే ఉంటుంది. అంతా వ్య‌క్తిగ‌తం. దాన్ని ఎవ‌రూ దొంగిలించ‌నూ లేరు. ప్ర‌పంచంలో ఉన్న ఎవ‌రైనా కావ‌చ్చు, ఎవ‌రి తెలివి వారికే సొంతం. అలాంటి తెలివి ఉన్న వారిని సొంతం చేసుకోవ‌డ‌మే పెద్ద పెద్ద కంపెనీల వ్యూహం. అందుకు తోడ్ప‌డేవే క్యాంప‌స్ ఇంటర్వ్యూలు. మ‌న దేశంలో ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల‌కు కొదువ లేదు. వాటిలో చ‌దువుతున్న విద్యార్థుల‌ను వారి కోర్సులు ముగియ‌కముందే చాలా కంపెనీలు క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. వారికి భారీ మొత్తంలో వేత‌నం ఇచ్చి త‌మ త‌మ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటాయి. అయితే క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు మ‌న దేశంలోని యూనివ‌ర్సిటీల్లో కొత్త కాక‌పోయినా, ఇటీవ‌లి కాలంలో ఆయా కాలేజీల్లో విద్యార్థుల‌కు అందుతున్న వేత‌న ప్యాకేజీలు చూస్తే ఎవ‌రికైనా దిమ్మ తిర‌గ‌క మాన‌దు. అంత పెద్ద మొత్తంలో వేత‌నం చెల్లించి విద్యార్థుల‌కు ఆఫ‌ర్లు ఇస్తున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్ర‌మంలో ఐఐటీ కాన్పూర్‌లో చ‌దువుతున్న ఓ విద్యార్థికి సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.1.50 కోట్ల జీతాన్ని అందిస్తూ స‌ద‌రు విద్యార్థిని ఇంట‌ర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంది.


ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి కాన్పూర్‌లోని ఐఐటీలో విద్య‌ను అభ్య‌సిస్తున్నాడు. అత‌ను చ‌దువుతోంది కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌. కోడింగ్‌లో దిట్ట‌. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే దున్నుకెళ‌తాడు. అందుకే మ‌రి, అత‌న్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో సెలెక్ట్ చేసుకుంది. అయితే అత‌నికి ఇచ్చిన ఉద్యోగానికి గాను ఆ సంస్థ 2.06 ల‌క్ష‌ల డాల‌ర్లు (సుమారు రూ.1.50 కోట్లు) జీతంగా చెల్లించ‌నుంది. అందులో 1.30 ల‌క్ష‌ల డాల‌ర్లు బేస్ పే కింద రానుండ‌గా, 70 వేల డాల‌ర్లు రిలొకేష‌న్‌, మెడిక‌ల్‌, వీసా ఖ‌ర్చుల కింద అత‌నికి అంద‌నున్నాయి.
ఈ క్ర‌మంలో స‌ద‌రు విద్యార్థి అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న రెడ్‌మండ్ ప‌ట్ట‌ణంలోని మైక్రోసాఫ్ట్ కార్యాల‌యంలో ఉద్యోగం చేయ‌నున్నాడు. సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేయ‌డం, బ‌గ్స్ క‌నిపెట్టి ఫిక్స్ చేయ‌డం అత‌ని ప‌ని. అయితే ఇలాంటి పెద్ద సాల‌రీ ప్యాకేజ్ ఇంత వ‌ర‌కు ఐఐటీ కాన్పూర్‌లో ఎవ‌రికీ రాలేద‌ట‌. దీంతో ఆ విద్యార్థి భ‌యం చెందాడో ఏమో తెలియ‌దు కానీ, త‌న పేరు ఇత‌ర వివ‌రాల‌ను గోప్యంగా ఉంచాల‌ని యూనివ‌ర్సిటీ అధికారుల‌ను కోరాడ‌ట‌. అందుకే ఆ విద్యార్థి వివ‌రాల‌ను చెప్ప‌మ‌ని మీడియా అడిగినా స‌ద‌రు యూనివ‌ర్సిటీ అధికారులు ఆ ప్ర‌శ్న‌ను దాటవేశారు. సరే… ఏది ఏమైనా మ‌న భార‌తీయ విద్యార్థికి అంత‌టి ప్ర‌ముఖ సంస్థ ఆరంభంలోనే కోట్ల రూపాయ‌ల జీతం ఇచ్చి సెలెక్ట్ చేసుకోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే క‌దా..!


No comments:

Post a Comment