Tuesday, 6 December 2016

ఇంజినీర్ ఉద్యోగాన్ని వ‌దిలి అడ‌వుల‌ను సృష్టిస్తున్న గొప్ప ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిత‌ను..!

రోజు రోజుకీ పెరిగిపోతున్న జ‌నాభా కార‌ణంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, న‌గ‌రీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతోంది. ఈ క్రమంలో జ‌నాభా అవ‌స‌రాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఆ అవ‌స‌రాలను తీర్చ‌డం కోసం, ఇంకా అనేక ఇత‌ర ప‌నుల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చెట్ల‌ను విప‌రీతంగా న‌రుకుతున్నారు. దీంతో ఏటా అడ‌వుల విస్తీర్ణం త‌గ్గుతూ వ‌స్తోంది. ఇది నిజానికి మాన‌వాళికి ఏ మాత్రం మంచిది కాదు. ఎంతో మంది స్వ‌చ్ఛంద సేవ‌కులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, ఎన్‌జీవోలు మొక్క‌లు నాట‌డంలో స‌హాయం చేస్తున్నారు కానీ దాంతో పోలిస్తే త‌రుగుతున్న అడవుల విస్తీర్ణ‌మే ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే అలా త‌గ్గుతున్న అడ‌వుల‌ను మళ్లీ పెంచ‌డ‌మే లక్ష్యంగా ప‌నిచేస్తున్నాడు ఆ వ్య‌క్తి. అత‌నే శుభేందు శ‌ర్మ‌.

 శుభేందు శ‌ర్మ నిజానికి ఓ ఇంజినీర్‌. ఓ ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ల‌క్ష‌ల్లో జీతం. అయితే అకీరా మియ‌వ‌కి అనే జ‌ప‌నీస్ బొటనిస్ట్ ఒక‌త‌ను కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న ప్రాంగ‌ణాల్లో మొక్క‌లు నాటుతూ శ‌ర్మ చేస్తున్న కంపెనీలో కూడా ఆ ప‌ని చేశాడు. దీంతో ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ‌ర్మ‌కు అకీరా మొక్క‌లు నాటే విధానం బాగా న‌చ్చింది. ఆయ‌న‌తోపాటు మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామి అయ్యాడు. అకీరా క‌నిపెట్టిన మియ‌వ‌కి టెక్నాల‌జీని బాగా అర్థం చేసుకున్నాడు. దాని ప్ర‌కారం, ఏ రకానికి చెందిన మొక్క‌లనైనా ప‌క్క‌ప‌క్క‌నే ఎక్కువ సంఖ్య‌లో నాటితే దాంతో భూమిలోంచి ఎక్కువ మొత్తం పోష‌కాలు ఆ మొక్క‌ల‌న్నింటికీ అందుతాయి. తద్వారా మొక్క‌లు చాలా ఏపుగా, బ‌లంగా పెరిగి వృక్షాలుగా మారుతాయి.

అయితే మియ‌వ‌కి టెక్నాల‌జీ గురించి పూర్తిగా తెలుసుకున్న శ‌ర్మకు వెంట‌నే ఓ ఆలోచ‌న త‌ట్టింది. అదేమిటంటే… ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లో త‌గ్గిపోతున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే చేస్తున్న మంచి ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి కేవ‌లం మొక్క‌లు పెంచుతూ అడ‌వుల‌ను క్రియేట్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. అందుకోసం ఎఫారెస్ట్ అనే ఒక ఎన్‌జీవోను కూడా అత‌ను ఏర్పాటు చేశాడు. అప్ప‌టి నుంచి శ‌ర్మ సొంత ఖర్చుల‌తో అనేక దేశాల్లో ప‌ర్య‌టిస్తూ కొన్ని ల‌క్ష‌ల మొక్క‌లు నాటి అడ‌వులను క్రియేట్‌ చేశాడు. అలా శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 6 దేశాల్లోని 28 న‌గ‌రాల్లో దాదాపు 85 వ‌ర‌కు చిన్న‌పాటి అడ‌వుల‌నే సృష్టించాడు. ఇప్పుడు అత‌ని ముందున్న ల‌క్ష్యం ఒక్క‌టే… ఖాళీ నేల క‌న‌బ‌డితే మొక్క‌లు నాటడ‌మే. ఆ భూమి అంతా ప‌చ్చ‌గా ఉండాల‌న్న‌దే ఆయ‌న అభిమ‌తం..! ఆయ‌న కోరిక‌, ల‌క్ష్యం నెర‌వేరాల‌ని ఆశిద్దాం..!

No comments:

Post a Comment