Tuesday, 6 December 2016

బ్యాంక్ మేనేజ‌ర్లే ఇలా చేస్తే… సామాన్య జ‌నాల‌కు ఇక డ‌బ్బు ఎలా అందుతుంది..?

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఓ వైపు జ‌నాలు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొత్త క‌రెన్సీ త‌గినంత దొరక్క‌పోవ‌డంతో ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియ‌ని స్థితిలో వారున్నారు. ఏటీఎంలు, బ్యాంకులు ఎప్పుడు చూసినా నో క్యాష్ బోర్డుల‌తోనే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. బ్యాంకుల్లోనైతే కేవ‌లం క్యాష్ డిపాజిట్ మాత్ర‌మే తీసుకుంటున్నారు. విత్ డ్రా అయితే త‌రువాత ర‌మ్మంటున్నారు. కార‌ణం అడిగితే క్యాష్ లేదంటున్నారు. ఇక ఏటీఎంల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా ఉంది. దాదాపుగా అన్ని ప్రైవేటు బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంలు బంద్ అయ్యాయి. ఉన్న ఆ ఒక‌టీ అరా ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంల‌లో క్యాష్ దొర‌క‌డం లేదు. మ‌రి ఆర్‌బీఐ అయితే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాష్ పంపుతున్నాం అని చెబుతోంది. కానీ తీరా చూస్తే ప‌రిస్థితి ఎలా ఉందో మ‌నంద‌రికీ తెలుసు. అయితే మ‌రి, అక్క‌డి నుంచి వ‌స్తున్న క్యాష్ అంతా ఎక్క‌డికి వెళ్తున్న‌ట్టు..?

 

 చ‌ట్టంలో ఉన్న లోపాల‌ను అడ్డంగా పెట్టుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది ఎన్ని నేరాలు చేసినా వాటిల్లోంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డుతున్నారు. అలాంటి వారు ఎక్కువ‌గా ఉన్న మ‌న దేశంలో ఇప్పుడీ నోట్ల ర‌ద్దు చేసినంత మాత్రాన వారు ఏదో ఒక అక్ర‌మ మార్గం ఎంచుకోరా..? అంటే క‌చ్చితంగా ఎంచుకుంటారు. చ‌ట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెద‌క‌డ‌మేగా వారి ప‌ని. న‌ల్ల బాబులు ఇప్పుడు చేస్తుంది ఇదే. త‌మ వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని వైట్‌గా ఎలా మార్చుకోవాలా అన్న విష‌యంలో వారు చ‌ట్టంలోని లోటు పాట్ల‌ను వెదుకుతుంటే కొంత మంది మాత్రం ఆ… అదంతా ఎందుకులే అని, ఏకంగా కొంద‌రు బ్యాంక్ మేనేజ‌ర్ల ను లైన్‌లో పెట్టి త‌మ వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని ఎంచ‌క్కా వైట్‌గా మార్చుకుంటున్నారు. న్యూఢిల్లీలోకి యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఓ బ్రాంచ్‌లో స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన పెద్ద మ‌నీ లాండ‌రింగ్ బాగోతం ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

 

 స‌ద‌రు బ్యాంక్ మేనేజ‌ర్ ఏం చేశాడంటే త‌న బ్రాంచ్‌లో ఉన్న ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ బ్యాంక్ అధికారుల‌తో క‌లిసి హ‌వాలా ముఠా, డ‌బ్బుల మార్పిడి ముఠాతో చేతులు క‌లిపారు. వారు తెచ్చి ఇస్తున్న సొమ్మును 30 శాతం క‌మిష‌న్‌కు కొత్త నోట్ల‌తో మార్పిడి చేస్తున్నారు. ఇదే కాక, న‌ల్ల‌బాబుల డ‌బ్బును తెల్ల‌గా మార్చేందుకు త‌మ బ్రాంచ్‌లోనే న‌కిలీ ఖాతాల‌ను కూడా ఓపెన్ చేశారు. వాటిలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా రూ.40 కోట్ల పాత నోట్ల‌ను డిపాజిట్ చేసిన‌ట్టు తెలిసింది. విష‌యం తెలిసిన ఐటీ అధికారులు రైడ్ చేయ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. ఇక ఇలాంటి అక్ర‌మార్కులు దేశం మొత్తం మీద ఇంకా ఎంత మంది ఉన్నారో..? ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత న‌ల్ల‌డ‌బ్బు అలా ఖాతాల్లో జ‌మ అయిందో..? ఎంత మార్పిడి చేశారో..? ఆ దేవుడికే తెలియాలి. లేదంటే విచారిస్తే కేంద్ర ప్ర‌భుత్వానికే తెలియాలి. మ‌నం ఏం చేస్తాం, నిమిత్త మాత్రులం క‌దా..!

 

No comments:

Post a Comment