Sunday, 4 December 2016

కొత్త నోట్లు తెస్తే రూ. 18 వేలకే తులం బంగారం’.. సీఐ గుట్టు రట్టు!

నోట్ల మార్పిడి పేరిట దోపిడీకి పథకం వేశాడు ఓ ఇన్‌స్పెక్టర్‌! తెరచాటు వ్యవహారంలో మోసానికి తెరలేపాడు. ఇందుకు సినీ ఫక్కీలో ఓ రాజకీయ నాయకుడితో కలిసి పక్కా స్కెచ్‌ వేశాడు. తొలుత 25 లక్షలు దోచుకున్నాడు. ఆ తర్వాత కోటి టార్గెట్‌ పెట్టుకున్నాడు. వ్యాపారులను బెదిరించి 1.20 కోట్లు దోచుకున్నారు. కానీ, ఖాకీ, ఖద్దరు దోపిడీ ఇప్పుడు బట్టబయలైంది. దోపిడీకి తెరలేపింది టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ కాగా, అతనికి సహకరించిన రాజకీయ నాయకుడు మాజీ మంత్రి దానం నాగేందర్‌ అనుచరుడు తిరుమల్లేశ్‌ నాయుడు. ఇప్పుడు ఈ ముఠా పరారీలో ఉంది.
 
దోపిడీకి ఓ ముఠా
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన తర్వాత, నగరంలో నోట్ల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతోందని ప్రచారం జరిగింది. 20 నుంచి 30 శాతం కమీషన్‌ నడుస్తోందని ప్రచారం జరిగింది. దాంతో, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నోట్లను సంపాదించిన పలువురు గ్రూపులుగా ఏర్పడి నగరానికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని టప్పాచబుత్ర అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ పథకంవేశాడు. నేరుగా రంగంలోకి దిగకుండా గతంలో దానం ఇంటి వద్ద పరిచయమైన కాంగ్రెస్‌ నాయకుడు, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12కు చెందిన తిరుమల్లేశ్‌ నాయుడును రంగంలోకి దించాడు. మార్పిడికోసం వచ్చే వారిని దోచుకున్నా కేసుల భయంతో ఫిర్యాదుచేసే అవకాశం లేదన్నాడు. దీంతో తిరుమల్లేశ్‌ నాయుడు తన మనుషులతో ఓ ముఠా సిద్ధం చేశాడు. కొత్త నోట్లు తెస్తే, తులం బంగారాన్ని రూ.18 వేలకే ఇస్తామని ప్రచారం చేయించాడు. తిరుమల్లేశ్‌ కారు డ్రైవర్‌ రాజు, మధ్యవర్తి మల్లేశ్‌తోపాటు మరో ఇద్దరు సహాయం చేశారు. వారి ప్రచారాన్ని నమ్మిన వెంకటబాబా అనే వ్యక్తి మిత్రులతో కలిసి 25 లక్షలతో తిరుమల్లేశ్‌ను సంప్రదించాడు. డబ్బు తీసుకొని ఫిలింనగర్‌లోని సాయి గెస్టు హౌస్‌కు రావాలని సూచించాడు. వారం రోజుల క్రితం వెంకటబాబా, కోటి, వెంకట్‌ తదితరులు గెస్టుహౌస్‌కు వచ్చారు. తిరుమల్లేశ్‌ నాయుడు తన మనుషులతో కలిసి వెళ్లి రూ.12.5 లక్షలు తీసుకొని వారిని బెదిరించి పంపించాడు.
 
ఈసారి టార్గెట్‌ కోటి
మొదటి దందా విజయవంతం కావడంతో ఈసారి ఎక్కువ డబ్బుకు తిరుమల్లేశ్‌, రాజశేఖర్‌ పథకం వేశారు. తులం బంగారాన్ని కొత్త నోట్లు తెస్తే రూ.18 వేలకే ఇస్తామని నగల వర్తకులను నమ్మించారు. దీంతో ఖమ్మం జిల్లాకు చెంది న లక్ష్మణ్‌ అగర్వాల్‌ మరో ముగ్గురితో కలిసి రూ.1.20 కోట్లతో ఈ నెల 1న నగరానికి వచ్చారు. తిరుమల్లేశ్‌కు ఫోన్‌ చేశారు. అతడు సూచించిన గెస్టుహౌస్‌లో దిగి డబ్బు లెక్కిస్తున్నారు. ఇంతలో తిరుమల్లేశ్‌ అక్కడకు చేరుకున్నాడు. అదే సమయంలో, రాజశేఖర్‌ మరో నలుగురు పెట్రోలింగ్‌ వ్యాన్‌లో గెస్టుహౌ్‌సకు వచ్చారు. రివాల్వర్‌తో లక్ష్మణ్‌ అగర్వాల్‌కు గురిపెట్టాడు. తాము పోలీసులమని నోట్ల మార్పిడి చేస్తున్నారా చంపేస్తా అంటూ బెదిరించడంతో వ్యాపారులు పారిపోయారు. అక్కడ ఉన్న డబ్బుతో రాజశేఖర్‌ ముఠా ఉడాయించింది. రెండు గంటల తర్వాత వ్యాపారులు తిరిగి వచ్చి చూడగా డబ్బు సంచులు కనిపించలేదు. తొలుత వెనకాడినా వ్యాపారులు శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తిరుమల్లేశ్‌, అతని అనుచరులు, ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌తోపాటు మరికొంతమంది ఈ దోపిడీకి పాల్పడ్డారని తేలింది.
 
అంతకుముందే తిరుమల్లేశ్‌ హల్‌చల్‌
బాధితులు ఫిర్యాదుకు ముందు శుక్రవారం మధ్యాహ్నం తిరుమల్లేశ్‌ నాయుడు బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. తాము చేసిన పనిపై ఏదైనా ఫిర్యాదు వచ్చిందా అని ఆరా తీసేందుకు ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలను కేజువల్‌గా పలకరించాడు. నోట్ల మార్పిడికి యువత తప్పుదోవ పడుతున్నారని, వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివా్‌సను కోరాడు. సమాచారం ఉంటే రైడ్‌ చేస్తామని సీఐ సమాధానం ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అతడిపై ఫిర్యాదు రావడంతో అసలు వ్యవహారం బయటపడింది. తిరుమల్లేశ్‌పై గతంలోకూడా బెదిరింపు కేసులు నమోదయ్యాయి. దోపిడీ వ్యవహారంలో కీలక నిందితులు తిరుమల్లేశ్‌, రాజశేఖర్‌ ముఠా పరారీలో ఉంది.
 
ఎందుకంత గోప్యం!?
దోపిడీలో సీఐ ర్యాంకు అధికారి పాత్ర ఉండటంతో తొలుత పోలీసులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా మీడియాకు దొరకకుండా దర్యాప్తుచేశారు. విషయం లీక్‌ కావడంతో ఎ-1గా తిరుమల్లేశ్‌ నాయుడు అండ్‌ అదర్స్‌ అని కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment